Monday, June 27, 2016

సేవాభారతి.. సేవే పరమావధి :: నిరుద్యోగ యువతకు ఉపాధి కోర్సుల్లో శిక్షణ

సేవాభారతి.. సేవే పరమావధి 
నిరుద్యోగ యువతకు ఉపాధి కోర్సుల్లో శిక్షణ 
మడికొండ, న్యూస్‌టుడే 
ఉన్నత చదువులు లేని యువకులు ప్రభుత్వ ఉద్యోగాలు రాక.. ఉపాధి అవకాశాలు లేక నిరుత్సాహానికి గురవుతుంటారు. అటువంటి వారికి బాసటగా నిలుస్తోంది మడికొండలోని సేవాభారతి సంస్థ. వేలకు వేలు వెచ్చించినా లభించని వివిధ వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తూ నిరుద్యోగ యువతకు చేయూతనిస్తోంది ఈ సంస్థ. యువతకు, మధ్య తరగతి మహిళలకు.. కుట్టుపని, బ్యూటీషియన్‌, ఫ్రిజ్‌, ఏసీ, కూలర్ల మెకానిజం తదితర ఉపాధి అంశాల్లో తర్ఫీదునిస్తూ నిపుణులుగా తీర్చిదిద్దుతోంది. స్వయంఉపాధితో తమ కాళ్లపై తాము నిలబడేలా నిరుద్యోగ యువతకు ప్రోత్సాహమందిస్తోంది. మడికొండలోని వేదవ్యాస పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సేవాభారతి రెండు రకాల సేవా కార్యక్రమాలను నిరాటంకంగా నిర్వహిస్తోంది. ఆర్థిక స్థోమత లేక ఉన్నత చదువులు చదవలేని విద్యార్థులను కళాశాలల్లో చేర్పించి చదివిస్తోంది. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న వివిధ ఉపాధి కోర్సుల్లో నిపుణులతో శిక్షణ అందిస్తున్నారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు భావ వ్యక్తీకరణ, ఆంగ్ల భాష నైపుణ్యాలను పెంపొందిస్తున్నారు. వేసవి సెలవుల్లో విద్యార్థినులకు బ్యూటీషియన్‌, మహిళలకు టైలరింగ్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. యువతకు సెల్‌ఫోన్‌, ఏసీ, కూలర్‌, ఫ్రిజ్‌లకు మరమ్మతులు చేయడంలో ప్రముఖ కంపెనీలకు చెందిన నిపుణులతో శిక్షణ ఇస్తోంది. నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి వదిలేయకుండా వారికి వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉపాధి కల్పించేందుకు సేవా భారతి వారధిగా నిలుస్తోంది. ఈ సంస్థలో ఇప్పటి వరకు శిక్షణ పొందిన వారి అభిప్రాయాలివీ.. 

ఉపాధిపై దిగులు పోయింది
సాయికిరణ్‌, ఏసీ, కూలర్‌, ప్రిజ్‌ మెకానిక్‌
నేను ఐటీఐ చదివాను. మడికొండలోని సేవాభారతిలో ఏసీ, కూలర్లు, ప్రిజ్‌లకు మరమ్మతులు చేయడంలో మూడు నెలల పాటు శిక్షణ పొందాను. గోద్రేజ్‌ కంపెనీ ప్రతినిధులు శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు నా ముగ్గురు స్నేహితులతో కలిసి పని చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నా. నాతో పాటు శిక్షణ పొందిన పదిహేను మందికి వివిధ కంపెనీల్లో ఉపాధి లభించింది. నేను తరచూ ఈ శిక్షణ కేంద్రానికి వచ్చి మెలకువలు నేర్చుకుంటూ నేర్పిస్తున్నాను. ప్రస్తుతం నాకు, నా స్నేహితులకు ఉపాధిపై దిగులు పోయింది.

ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడుతున్నాను
వై.వర్షిత, ఇంటర్‌ విద్యార్థిని
నేను వేసవి సెలవుల్లో మడికొండ వేదవ్యాస పాఠశాల ఆవరణలోని సేవాభారతిలో ఉచిత స్పోకెన్‌ ఇంగ్లీస్‌ తరగతులకు వెళ్లాను. ప్రస్తుతం పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలను ఆంగ్లంలోనే నిర్వహిస్తున్నారు. అంతే కాక నేటి ఆధునిక ప్రపంచంలో ఆంగ్లం తప్పనిసరిగా రావాలనే పట్టుదలతో నేర్చుకున్నాను. పది రోజుల వ్యవధిలోనే నేను బిడియం లేకుండా ఆంగ్లంలో మాట్లాడాను. ఇక మీదట సేవాభారతి నిర్వహించే అన్ని కార్యక్రమాలకు హాజరై వివిధ ఉపాధి కోర్సులను నేర్చుకుంటాను. బాలికలు, మహిళలు అనుసరించాల్సిన వస్త్రధారణ, సంస్కారం వంటి అంశాలను బాగా వివరించారు.

కుట్టుపై పట్టు వచ్చింది
శ్రీవిద్య, టైలరింగ్‌ నేర్చుకున్న మహిళ
మా పిల్లలను పాఠశాలకు పంపించిన తర్వాత ఏం చేయాలో తోచేది కాదు. మడికొండ వేద వ్యాస పాఠశాలలో సేవాభారతి ఆధ్వర్యంలో ఉచితంగా టైలరింగ్‌ శిక్షణ ఇస్తున్నట్లు తెలిసింది. శిక్షణలో చేరి కుట్టు పనులు నేర్చుకున్నాను. పది రోజుల వ్యవధిలో కొన్ని మాత్రమే నేర్చుకున్నానన్న నిరాశ నాలో ఉంది. మరో పదిరోజులు నేర్పిస్తే పిల్లల దుస్తులు కూడా కుట్టడం నేర్చుకునే అవకాశం ఉండేది. మొత్తానికి మిషన్‌పై కూర్చోవడం కూడా తెలియని నాకు కుట్టులో పట్టు వచ్చింది.


అందంపై మక్కువతో నేర్చుకున్నా
- శృతి, డిగ్రీ విద్యార్థిని
నేను అందంపై మక్కువతో సేవా భారతిలో బ్యూటీషియన్‌ కోర్సు నేర్చుకున్నాను. ఫేషియల్‌, హెన్నా, పెడిక్యూర్‌ వంటి అంశాలను శిక్షణలో నేర్పించారు. ఇంట్లో లభించే పదార్థాలతో మేకప్‌ ఎలా వేసుకోవాలి. అందంగా ఎలా తయారు కావాలి అనే విషయాలను నేను బాగా నేర్చుకున్నాను. అంతేకాకుండా మా ఇంట్లో వాళ్లకు ఫేషియల్‌ చేసి శభాష్‌ అనిపించుకున్నాను. స్పోకెన్‌ ఇంగ్లీషులో కూడా శిక్షణ తీసుకున్నాను. ఒకసారి బ్యుటీషియన్‌, ఆంగ్లం నేర్చుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. సేవాభారతిలో అందించే కోర్సులను అందరూ ఉపయోగించుకోవాలి. ఎవరో ఉద్యోగం ఇస్తారని ఎదురు చూడకుండా మనమే

టెక్నిషియన్‌గా ఎదగాలి. .
ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే లక్ష్యంగా సేవలు
-సత్యం, సేవాభారతి నిర్వాహకుడు
సేవాభారతి రాష్ట్ర వ్యాప్తంగా 15 శాఖలను ఏర్పాటు చేసి యువతలో ఆత్మస్థైర్యాన్ని నింపుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏకోపాధ్యాయ, బాల సంస్కార కేంద్రాలు, ట్యూషన్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. మడికొండలో ఏర్పాటు చేసిన సేవాభారతిలో మొదటి బ్యాచ్‌ ద్వారా 20 మందికి ఏసీ, కూలర్‌, ఫ్రిజ్‌ల మరమ్మతుల్లో శిక్షణ ఇచ్చాం. కొందరికి ప్రైవేటు కంపెనీల్లో ఉపాధి లభించింది. ఇంకా మహిళలు, విద్యార్థుల కోసం తక్కువ వ్యవధిలో కొన్ని కోర్సులను రూపొందించి నేర్పిస్తున్నాం. యువత నిరాశ నిస్పృహలకు లోనుకాకుండా స్వయం ఉపాధి పొందేలా శిక్షణ ఇస్తున్నాం.


Source: http://archives1.eenadu.net/06-18-2016/district/inner.aspx?dsname=Warangal&info=wgl-sty4

No comments:

Post a Comment